సెప్టెంబర్ మూడవ వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు(SPECIAL PARLIAMENT SESSION IN SEPTEMBER IN TELUGU):
పార్లమెంటరీ సెషన్ అంటే ఏమిటి?:
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఒకచోట సమావేశమయి, నిర్మాణాత్మక నిర్ణయాలు చేపట్టేటటువంటి కాలపరిమితి. వారు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంటరీ సెషన్ అనేది మొదటి రోజు నుండి నిర్దేశించిన చివరి రోజు వరకూ నిర్దిష్ట కాల పరిమితిలో తీసుకునే నిర్ణయాలను సూచిస్తుంది. స్థూలంగా ఇదీ దీని అర్థం. సెషన్‌లు నిర్ణీత ప్రారంభ, ముగింపు తేదీని కలిగి ఉంటాయి. శాసన సభ నియమాలు సాధారణంగా దీనిని నిర్ణయిస్తాయి. ఒక సెషన్ సమయంలో, చట్టసభ సభ్యులు బిల్లులను ప్రవేశపెడతారు. వాటిపై సుదీర్ఘమైన చర్చ జరుపుతారు. సవరణలను ప్రతిపాదిస్తారు. చట్టంపై ఓటు వేస్తారు. చట్టం చేస్తారు.
పాలన, ప్రజా విధానాలు, ప్రజల సంక్షేమంపై ముఖ్యమైన విషయాలను పరిష్కరించడానికి సెషన్‌లు ప్రతినిధులను అనుమతిస్తాయి. పార్లమెంటు సమావేశాలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి జవాబుదారీ తత్వాన్ని అలవరచడానికి ఒక వేదిక.
సాధారణంగా సమావేశాలు మూడు రకాలుగా ఉంటాయి.
బడ్జెట్ సెషన్,
వర్షాకాలం సమావేశాలు,
శీతాకాలం సమావేశాలు.. ఇవి కాక మరొక రకంగా కూడా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.
44వ సవరణ చట్టంలోని, ఆర్టికల్ 352(8) ప్రకారం ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుంది.
లోక్‌సభ సభ్యుల్లో పదవ వంతు కంటే తక్కువ కాకుండా రాష్ట్రపతికి లేదా స్పీకర్‌కు లేఖ రాస్తే, లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ప్రభుత్వం పిలవవచ్చు.
ఆగస్ట్ 31న, పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి, ప్రహ్లాద్ జోషి సెప్టెంబర్ 18 నుండి 22 వరకు పార్లమెంటు "ప్రత్యేక సమావేశాలు" నిర్వహించబడతాయని ప్రకటించారు. సెషన్ ఎజెండాలో "ముఖ్యమైన అంశాలు" ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలో ఈ విషయానికి సంబంధించిన నోటీస్ ను సర్క్యులేట్ చేస్తుంది.
ఈ ప్రకటన ప్రతిపక్షాలలో, రాజకీయ పండితులలో రకరకాల ఊహాగానాలకు దారి తీసెట్లు చేసింది. సాధారణంగా పార్లమెంటు సమావేశాలకు కొన్ని రోజుల ముందు, ప్రభుత్వం తన ఎజెండాను పంచుకోవడానికి, చర్చకు సాధ్యమయ్యే సమస్యలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. జూన్ 30, 2017 అర్ధరాత్రి GST రోల్-అవుట్ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ విధమైన ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశాల పై అనేక రకాల ఊహాగానాలు చేస్తున్నారు.
లోక్‌సభ ముందస్తు ఎన్నికలు?:
వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం, ప్రస్తుత పార్లమెంటును రద్దు చేయడం, ముందస్తు లోక్‌సభ ఎన్నికలను ప్రకటించడం అనేది ఊహించిన ఎజెండా అంశాలలో ఒకటి. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారా తీసుకురావచ్చు. అందువల్ల ముందస్తు ఎన్నికలు నిజంగా ఎజెండా అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.
బిజెపి ప్రభుత్వ ప్రకారం తన విజయాల ప్రోగ్రెస్ కార్డ్ ను ప్రజలకు తెలియజేయటానికి ఈ సమావేశాలు ఉపయోగించుకుంటుందని వార్తాసంస్థ భావిస్తోంది.
జమిలి ఎన్నికలు:
రాష్ట్రాలకు, కేంద్రానికి కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి కావలసిన విధివిధానాలను నిర్ణయించడానికి సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయని మరొక వాదన. దీని వల్ల ఎన్నికల ఖర్చు కలిసి రావటమే కాక, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా ఉంటాయని ప్రభుత్వ వాదన.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై విపక్షాలు:
ప్రత్యక సమావేశాలపై ప్రతిపక్షాలు మాత్రం మరో రకమైన వాదనను వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకారం కేంద్రం విపరీతమైన భయాందోళనలకు గురి కావటమే ముందస్తు ఎన్నికల ఎత్తుగడ అని అన్నారు. తాను లోక్ సభలో మోడీకి సన్నిహితుడైన అదానీ గురించి ప్రశ్నిచడం వల్ల ఆ పార్టీ విపరీతమైన చికాకుకు గురి అయ్యి అది భయాందోళనలకు దారి తీసి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవటానికి కారణమౌతోందని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ ఐన ఒవైసీ ఉద్దేశ్యం ప్రకారం ఈ ప్రత్యేక సమావేశాలలో చైనా గురించి, దాని వ్యవహారాలగురించి మాట్లాడే అవకాశం ఉండాలని అభిప్రాయ పడ్డారు.
నిజానికి ప్రత్యేక సెషన్ ప్రకటన రాజకీయ వర్గాన్ని, పండితులను ఆశ్చర్యపరిచింది. ముందస్తు సాధారణ పోల్ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. బిజెపి లోక్‌సభ ఎన్నికలను డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించవచ్చును అని. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఈ ఏడాది డిసెంబర్‌లో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికలను నిర్వహించవచ్చని బెంగాల్ చేసిన వాదనను పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇతర సిద్ధాంతాలు:
ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇతర ఊహాగానాలు కూడా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుండగా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ముందస్తు సంకేతాలు సానుకూలంగా లేవు. విపక్ష కూటమికి బలం చేకూర్చేందుకు, బీజేపీ సమయం ఇవ్వడం లేదన్న విమర్శ కూడా ఉంది. వీటన్నింటిని పరిశీలిస్తే బీజేపీ రాష్ట్ర ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలతో కలుపుకుపోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, కొత్తగా నిర్మించిన రామాలయాన్ని జనవరిలో ప్రారంభించబోతున్నారు. దీనిని కూడా బీజేపీ రాజకీయంగా వచ్చే జనరల్ ఎన్నికలలో ఒక ప్రధాన అంశంగా వాడుకోవచ్చని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ముంబైలో I.N.D.I.A. కూటమి సమావేశం ప్రారంభమైన రోజునే, పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. రెండు రోజుల మేధోమథన సమావేశానికి, బిజెపిని వ్యతిరేకిస్తున్న రెండు డజన్లకు పైగా పార్టీలు హాజరవుతాయని, ఈ సందర్భంగా వారు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన అంశాలను చర్చించి ఇతర ఎజెండాలను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ 1న ప్రతిపక్షాల సమావేశం ముగుస్తుంది.
ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఎజెండాపై కూడా స్పష్టత లేదు. యూనిఫాం సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్లు, జమ్మూ & కాశ్మీర్‌కు స్టేట్ హుడ్ పునరుద్ధరణ, బీమా వంటి కొన్ని కీలక బిల్లులను ఉభయ సభలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. న్యాయ శాస్త్రానికి కొత్త రూపు ఇవ్వడానికి మూడు బిల్లులు స్టాండింగ్ కమిటీ వద్ద ఉన్నందున, వాటిని చేపట్టే అవకాశం లేదు. G20లో భారత అధ్యక్ష పదవిపై ప్రత్యేక తీర్మానాన్ని కూడా ఆమోదించాలని భావిస్తున్నారు.
ముగింపు:
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ప్రకటన రాజకీయ పార్టీలలో, నాయకులలో, విశ్లేషకులలో ఆశ్చర్యాన్ని కలుగ జేసిందనేది వాస్తవం. ప్రతిపక్షాలు ముంబైలో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ ప్రకటన రావటం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉన్నదని కొందరి అభిప్రాయం. మెడీ పాటించే సూత్రం ఏమిటంటే, “ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్”. ఈ ప్రకటన అందరి దృష్టిని ఒక్కసారిగా ముంబై నుండి ఢిల్లీ వైపు తిరిగేటట్లు చేసింది. అంతేకాకుండా ముంబై సమావేశాల గురించి చర్చ కన్నా, ప్రత్యేక సమావేశంలో ఏమి జరగవచ్చు అన్న చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.
